: అతను 1,61,220 ఎలుకల్ని చంపి, ఛాంపియన్ అయ్యాడు!
నవ్యాంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు పేషెంట్ల జోలి కొస్తాయి. కానీ, బంగ్లాదేశ్ ఎలుకలు మాత్రం మనుషుల జోలికి రావు. వారు దాచుకున్న ఆహారాన్ని మాత్రం నిమిషాల్లో ఖాళీ చేసి పారేస్తాయి. వాటి బెడద పడలేక గత ఏడాదిలో లక్షన్నరకు పైగా ఎలుకలను చంపేశాడు అతను. బంగ్లాదేశ్ గ్రామాలలో మూషికాల బాధ అంతా ఇంతా కాదు. ప్రతి ఏటా అక్కడి ఎలుకలు తినే ఆహారపదార్థాలు 1.5 మిలియన్ల నుంచి 2 మిలియన్ టన్నుల వరకు ఉంటుంది. దీంతో గ్రామస్తులకు ఎక్కడ లేని చికాకు వచ్చింది. అంతే, ఎవరికందిన ఎలుకను వారు చంపిపారేసేవారు. అయితే, ఎలుకలను చంపడంలో అబ్దుల్ ఖలెక్ మిర్బోహర్ అనే వ్యక్తిని మించిన వారు మరొకరు లేరు. ఎందుకంటారా? గత 12 నెలల్లో 1,61,220 ఎలుకల్ని చంపి రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు బంగ్లా ప్రభుత్వంతో శభాష్ అనిపించుకున్నాడు. ఎలుకల్ని చంపడంలో అతన్ని జాతీయ ఛాంపియన్ గా ప్రభుత్వం ప్రకటించింది. 20 వేల బంగ్లాదేశ్ టాకాలను కూడా బహుమతిగా అందుకున్నాడు అబ్దుల్.