: పండుగ సీజనులో పలకరించనున్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు!
ఈ పండుగ సీజనులో భారత మార్కెట్లో తమ వ్యాపారాలను పెంచుకోవాలని భావిస్తున్న స్మార్ట్ ఫోన్ తయారీదారులు పెద్దఎత్తున కొత్త ప్రొడక్టులను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఇండియాలో విడుదల కానున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ల వివరాలివి. యాపిల్ ఐఫోన్, 6ఎస్, 6ఎస్ ప్లస్: ఈ ఫోన్ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి, ధరల గురించిన సమాచారం అందరికీ తెలిసిందే. మూడు వేరియంట్లలో లభించే ఈ స్మార్టెస్ట్ ఫోన్లు ఈనెల మూడవ వారంలో మార్కెట్ ను తాకనున్నాయి. గూగుల్ నెక్సస్ 5ఎక్స్, 6పీ: గూగుల్ సంస్థ నుంచి తాజాగా వస్తున్న ఈ ఫోన్లు 13వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. టైప్-సీ యూఎస్బీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 12.3 ఎంపీ కెమెరా, సరికొత్త ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 4కే వీడియో సపోర్ట్, మరింత పవర్ ను అందించే 2,700 ఎంఏహెచ్ బ్యాటరీ వీటికి అదనపు ఆకర్షణ. 32, 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తాయి. సోనీ ఎక్స్ పీరియా జడ్5 ప్రీమియం: ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 4కే డిస్ ప్లే (3840/2160 పిక్సెల్)తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. 5.5 అంగుళాల ట్రిలుమినోస్ డిస్ ప్లే తో లభించే ఫోన్ లో 23 ఎంపీ కెమెరా ఉంది. క్వాల్ కాం క్విక్ చార్జ్ తో లభించే ఫోన్ కు 10 నిమిషాల చార్జింగ్ పెడితే ఐదున్నర గంటలు పనిచేస్తుందని, నీటిలో పడ్డా పాడుకాదని సంస్థ చెబుతోంది. లెనోవో వైబ్ ఎస్1: ముందు వైపు రెండు కెమెరాలు ఉన్న తొలి ఫోన్ గా వైబ్ ఎస్ 1 మార్కెట్లోకి వస్తోంది. డ్యూయల్ ఫ్లాష్ తో పాటు ముందు వైపు 8, 2 మెగాపిక్సెల్ కెమెరాలు, వెనుకవైపు 13 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 32 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యమున్న ఫోన్ 5 అంగుళాల స్క్రీన్ ను, ఫుల్ హెడ్ డీ డిస్ ప్లేను కలిగివుంటుంది. కేవలం 7.8 మిల్లీమీటర్ల మందం, 132 గ్రాముల బరువుతో 4జీని సపోర్ట్ చేసే ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఆసుస్ జన్ ఫోన్ మాక్స్: ఈ నెలలో మార్కెట్ ను తాకనున్న మరో స్మార్ట్ ఫోన్ జన్ ఫోన్ మాక్స్. 5.5 అంగుళాల స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్, 1.2 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ రామ్, 8/16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. జియోనీ ఎస్ 5.1 ప్రో: 5 అంగుళాల తెర, 16 గిగాబైట్ల మెమొరీ, 2,400 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఈ 4జీ ఫోన్ లో ఆక్టాకోర్ ప్రాసెసర్, 4.0 బ్లూటూత్ సదుపాయాలున్నాయని, 5.3 మిల్లీమీటర్ల మందంతో 129 గ్రాముల బరువుతో లభిస్తుందని జియోనీ వెల్లడించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ల ధరలు ఎంచుకునే సంస్థను, వేరియంట్ ను బట్టి రూ. 22 వేల నుంచి రూ. 80 వేల మధ్య ఉంటాయి.