: అమెరికా డబుల్ గేమ్... పాకిస్థాన్ తో కూడా అణు ఒప్పందం!
పెద్దన్న అమెరికా తనదైన శైలిలో డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా, అదే తరహా ఒప్పందాన్ని పాకిస్థాన్ తో కూడా కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని 'వాషింగ్టన్ పోస్ట్' ప్రచురించింది. ఈ నెలలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ యూఎస్ పర్యటన నేపథ్యంలో, ఈ డీల్ కుదరనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టు పత్రిక తెలిపింది. కాగా, పాక్ అణు కార్యక్రమాలను నియంత్రించేందుకే ఈ డీల్ కు అమెరికా మొగ్గు చూపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవిక అవసరాలకు మాత్రమే అణు పరిజ్ఞానాన్ని వాడాలని, ఇండియా నుంచి అణు ప్రమాదం ఉందని చెబుతూ, ఆయుధాలు తయారు చేయకుండా ఉండాలన్న షరతులపై సాంకేతికతను అందిస్తామని అమెరికా స్పష్టం చేసినట్టు 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. కాగా, తొలిదశలో పాకిస్థాన్ పై ఉన్న 48 ఎన్ఎస్జీ (న్యూక్లియర్స్ సప్లయర్స్ గ్రూప్) దేశాల నిషేధాన్ని ఎత్తివేస్తారని సమాచారం. ఆపై అణు సాంకేతికత, అత్యాధునిక పరికరాలను అందించనుంది. ఇప్పటికే అణ్వస్త్ర పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసి ఆణ్వాయుధాలను సమకూర్చుకున్న పాకిస్థాన్, అమెరికా ఇచ్చే పరిజ్ఞానంతో మరిన్ని విధ్వంసక ఆయుధాలు తయారు చేయవచ్చన్న అనుమానాలను తోసిపుచ్చలేం.