: టీట్వంటీ, వన్డే మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం
మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రేపు జరగనున్న చివరి టీట్వంటీ మ్యాచ్ తో బాటు, ఈ నెల 11న కాన్పూర్ వేదికగా జరగనున్న తొలి వన్డే మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియాలకు వెళ్లే అభిమానులు వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్సులు, ఇనుప వస్తువులు తీసుకువెళ్లడాన్ని నిషేధించారు. కటక్ లో సోమవారం నిర్వహించిన రెండో టీట్వంటీలో ప్రేక్షకులు స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు విసిరి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పది అడుగుల ఎత్తైన నెట్ ను ఏర్పాటు చేయనున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు ఎలాంటి వస్తువులు విసిరేసినా నెట్ వాటిని అడ్డుకుంటుందని వారు పేర్కొంటున్నారు. అలాగే భద్రతా ఏర్పాట్లు కూడా పెంచనున్నట్టు సమాచారం. మరోసారి కటక్ ఘటన పునరావృతమైతే సిరీస్ నుంచి తప్పుకుంటామని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు హెచ్చరించిన సంగతి తెలిసిందే.