: వైట్ వాష్ కు సఫారీలు...పరువు దక్కించుకునేందుకు టీమిండియా
మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా సిరీస్ లో టీట్వింటీలు చివరికి చేరుకున్నాయి. ధర్మశాల టీట్వంటీలో మంచు భారత్ ను ఓడిస్తే, కటక్ లో టాపార్డర్ టీమిండియాను నట్టేట ముంచింది. దీంతో సిరీస్ లోని టీట్వంటీల్లో విజయం సాధించిన సౌతాఫ్రికా జట్టు వైట్ వాష్ పై దృష్టిపెట్టింది. ఈడెన్ లో టీట్వంటీ గెలిస్తే భారత్ లో భారత్ ను వైట్ వాష్ చేసిన ఘనత సాధించవచ్చు. అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకునేందుకు సఫారీ జట్టు ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ప్రోటీస్ ఉత్సాహంగా ఉన్న వేళ...టీమిండియా ఆటగాళ్లు పోరాడితే పోయేదేం లేదు, ఓటమి భయం తప్ప అనుకుంటున్నారు. టీమిండియా పరువు నిలబడాలంటే చివరి టీట్వంటీలో గెలిచి తీరాలి. ఈ గెలుపు టీమిండియాకు అనివార్యం. ఎందుకంటే తరువాత ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కు అదే ఆక్సిజన్ కానుంది. సౌతాఫ్రికా టాపార్డర్ భీకరమైన ఫాంలో ఉంది. టీమిండియా టాపార్డర్ బద్దకాన్ని వదిలించుకునేందుకు నానాతంటాలు పడుతోంది. రెండో టీట్వంటీలో ఓటమికి కారణంగా రక్షణాత్మకంగా ఆడడమేనని ధోనీ చెప్పడంతో చివరి టీట్వంటీలో టీమిండియా టాపార్డర్ వేగంగా ఆడనుందని సంకేతమిచ్చాడు. కాగా, ధావన్, రోహిత్, కోహ్లీ, రైనా, ధోనీతో టీమిండియా టాపార్డర్ బలంగా ఉందని, అయితే నిలదొక్కుకుని ఆడితే తప్ప భారీ స్కోర్లు సాధ్యం కావని వెటరన్లు హెచ్చరిస్తున్నారు. రెండు టీట్వంటీల్లో ధావన్ తక్కువ స్కోరుకే పరిమితం కావడం జట్టును ఇబ్బందుల్లో పడేస్తోందని వారు పేర్కొంటున్నారు. చివరి టీట్వంటీలో విజయం సాధించి పరువు నిలుపుకుంటారో, లేక ఓటమితో ఆత్మవిశ్వాసం కోల్పోతారో చూడాలని అభిమానులు భావిస్తున్నారు.