: రాహుల్ కోసం పొలాలు ధ్వంసం... కన్నడనాట కొత్త వివాదం!
రాహుల్ గాంధీ పాల్గొనే బహిరంగ సభ కోసం కోతలు కోయని పంట పొలాలను కోసేసి, పొలాలను చదును చేయడం కర్ణాటకలో కొత్త వివాదానికి తెరలేపింది. మధ్య కర్ణాటకలోని రాణిబెన్నూరు గ్రామం సమీపంలో నాలుగు ఎకరాల మొక్కజొన్న తోటను రాహుల్ సభ కోసం నాశనం చేశారు. ఈ విషయంపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. "రాహుల్ వచ్చి పోయేందుకు ఓ పేద రైతు తన పంటను కోల్పోవాల్సి వచ్చింది" అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాఖ్యానించారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు పర్యటిస్తున్న వేళ, ఈ ఘటన జరగడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పొలంలోని పంట మరో 15 రోజుల్లో కోతకు రానుందని, దాన్ని నాశనం చేశారని విమర్శించారు. కాగా, ఈ ప్రాంతానికి హెలికాప్టర్లో వచ్చే రాహుల్ గాంధీ, 9 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారని సమాచారం.