: ‘ఖైదీ’ మాజీ మంత్రిగారి రాజభోగం...‘ఖాకీ’ వేషంలో వెళ్లి బట్టబయలు చేసిన విలేకరులు
ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అమర్ మణి త్రిపాఠి, ఆయన భార్య మధుమణిలు రచయిత్రి మధుమిత శుక్లా హత్య కేసులో దోషులుగా తేలారు. కోర్టు జీవిత ఖైదు విధించగా, గోరఖ్ పూర్ లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనారోగ్యం పేరిట ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి, ఆయన భార్య సకల భోగాలు అనుభవిస్తున్నారు. అంతేకాదు, ఆసుపత్రి వేదికగానే మాజీ మంత్రి గారు దర్బారు కూడా నడిపిస్తున్నారట. త్రిపాఠి రాజభోగానికి, దర్బారుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి పగలూ రాత్రి అన్న తేడా లేకుండా సేవలు చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం సేకరించిన స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్ చేసి మంత్రిగారి రాజభోగాన్ని బట్టబయలు చేసింది. త్రిపాఠి సేవల్లో తరిస్తున్న పోలీసు అధికారి కళ్లుగప్పేందుకు మీడియా ప్రతినిధులు పోలీసుల వేషధారణలో అక్కడికి వెళ్లారట. రహస్య కెమెరాల ద్వారా మంత్రిగారి రాజభోగాలను, దర్బారును పూర్తిగా చిత్రీకరించుకుని బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపుతోంది.