: తొలిసారిగా ఏయూ అపూర్వ సమ్మేళనం... నేటి నుంచి 12 వరకు వేడుకలు
1926లో ఆవిర్భవించిన ప్రఖ్యాత ఆంధ్ర యూనివర్శిటీ... తొలిసారిగా అధికారికంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని (అలుమ్ని-2015) నిర్వహిస్తోంది. ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో ఈ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించి యూనివర్శిటీలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇకపై ప్రతియేటా అక్టోబర్ 12వ తేదీన అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇప్పటిదాకా కేవలం విభాగాల వారీగా మాత్రమే పూర్వ విద్యార్థులు తమ సమావేశాలను నిర్వహించుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత... ఏపీలో ఆంధ్ర యూనివర్శిటీ అతిపెద్ద వర్శిటీగా అవతరించింది. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్శిటీలతో పోటీపడి అంతర్జాతీయ ర్యాంకులను ఏయూ విద్యార్థులు సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో, యూనివర్శిటీని మరింత అభివృద్ధి చేయాలని, ఇందుకు ఆర్థికంగా స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు సహాయ, సహకారాలు అందించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, అలుమ్ని-2015లో పూర్వ విద్యార్థులందరినీ భాగస్వాములను చేస్తున్నారు. ఈ క్రమంలో, ఏయూలోని అంబేద్కర్ అసెంబ్లీ హాల్ లో నేటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, రేపు (8వ తేదీ) బీచ్ రోడ్డులో వర్శిటీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించనున్నారు. 10, 11 తేదీల్లో యూనివర్శిటీలో విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయాన పూర్వ విద్యార్థులంతా వారివారి విభాగాలకు చేరుకుని, సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం వారి విభాగాలు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత, సాయంత్రం యూనివర్శిటీలోని సీఆర్ రెడ్డి స్నాతకోత్సవ మందిరంలో జరిగే అపూర్వ సమ్మేళనం 'అలుమ్ని-2015' కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రాత్రికి యూనివర్శిటీ ఇచ్చే ఆతిథ్యం స్వీకరిస్తారు.