: విప్రోలో లైంగిక వేధింపులు... కేసు వేసిన ఉద్యోగిని
విప్రో కార్యాలయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ, తనకు మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 9.90 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓ ఉద్యోగిని కోర్టులో కేసు వేసింది. బ్రిటన్ లోని విప్రో ఆఫీసులో తాను పనిచేస్తున్న సమయంలో తనను వేధించారని, ఇతర ఉద్యోగులతో సమానమైన వేతనాలు చెల్లించలేదని, అసభ్యంగా ప్రవర్తించారని శ్రేయా ఉకిల్ (39) అనే మాజీ ఉద్యోగిని ఈ కేసు వేసింది. ఆమె తన అనుభవాలను 'టెలిగ్రాఫ్' పత్రికతో పంచుకుంటూ "అక్కడ స్త్రీ ద్వేష సంస్కృతి, శ్రమ దోపిడీ అధికం. అక్కడి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ పుంజాతో అఫైర్ పెట్టుకునేలా నన్ను బలవంతం చేశారు. అక్కడ పనిచేసే మహిళలు నరకంలో ఉన్నట్టే. తన అధికారాన్ని వినియోగిస్తూ పుంజా నన్ను ఎంతో వేధించారు" అని అన్నారు. తనను అన్యాయంగా సంస్థ నుంచి తొలగించారని, తనతో సమానంగా పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 1.5 లక్షల పౌండ్లు వేతనం ఇస్తూ, తనకు 75 వేల పౌండ్ల వేతనమే ఇచ్చారని ఆరోపించారు. కాగా, పుంజా విప్రోలో బీపీఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్) విభాగానికి సీఈఓగా జూన్ 2012 నుంచి రెండేళ్ల పాటు పనిచేశారు. ఈ కేసులో విప్రో ఉన్నతాధికారుల స్పందన కోరగా, సమాధానం రాలేదు.