: నడిరోడ్డుపై కాలి బూడిదైన లగ్జరీ కారు... కలకలం రేపుతున్న జైపూర్ ఘటన
‘పింక్ సిటీ’గా పర్యాటకుల చేత పిలిపించుకున్న రాజస్థాన్ రాజధాని జైపూర్ లో నిన్న రాత్రి జరిగిన ఓ ఘటన అక్కడ కలకలం రేపింది. నునుపైన రోడ్డుపై రయ్యిమని దూసుకొస్తున్న ఓ ఖరీదైన కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే, వెనువెంటనే అప్రమత్తమైన కారు యజమానితో పాటు కారు డ్రైవర్ కూడా దానిలోనుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ తర్వాత నడిరోడ్డుపైనే కారు తగలబడిపోయింది. కారు నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడిన యజమాని కాని, డ్రైవర్ కాని మంటలను ఆర్పేందుకు ఏమాత్రం యత్నించలేదు. దీంతో దాదాపు గంట పాటు ఎగసిపడ్డ మంటలు కారును బూడిద చేసేశాయి. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన కారు తగలబడిపోతుంటే, ఆ యజమాని ఎందుకు స్పందించలేదు? కారులోని సాంకేతిక లోపాలే మంటలకు కారణమా? లేదా కుట్రలో భాగంగానే అది కాలిపోయిందా? అనే కోణాల్లో ఈ ఘటనపై పెద్ద ఎత్తున అక్కడ చర్చలు నడుస్తున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఘటన వెనుక గల అసలు కారణాలను వెలికితీసే పనిని మొదలుపెట్టారు.