: ఓటుకు నోటు తప్పేమీ కాదుగా... 80 శాతం బీహారీ ఓటర్ల అభిప్రాయం ఇదేనట!


ఓటేయాలంటే నోటివ్వాల్సిందే. ఇందులో తప్పేముంది అంటున్నారు బీహారీ ఓటర్లు. ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థి తనకు ఓటు వేయమని కోరే క్రమంలో డబ్బుతో పాటు ఇతర బహుమతులు ఇస్తున్న వైనం దేశంలో కొత్తేమీ కాదు. అయితే ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ఇక ఎన్నికల సమయంలో అధికారం వెలగబెడుతున్న పార్టీలతో పాటు, ప్రతిపక్షంలోని పార్టీలు కూడా తమ ప్రభుత్వాలు వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ ఏకంగా ‘మేనిఫెస్టో’ల పేరిట అధికారిక తాయిలాలు ప్రకటిస్తున్నాయి. వీటిని తప్పుబట్టని ఎన్నికల సంఘం, అభ్యర్థులు పంచే డబ్బు, బహుమతులను మాత్రం నేరంగా పరిగణిస్తోంది. ఎన్నికల సమయంలో ఎక్కడికక్కడ దాడులు చేస్తూ డబ్బుతో పాటు బహుమతులను ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేస్తున్న విషయమూ తెలిసిందే. ప్రస్తుతం బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నోట్ల కట్టలు కాదు, నోట్ల మూటలు గుట్టలుగుట్టలుగా పట్టుబడుతున్నాయి. ఇదిలా ఉంటే, అసలు ‘ఓటుకు నోటు’పై ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ సర్వే నిర్వహించిందట. ఈ సర్వేలో సంఘం అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిసొచ్చాయి. ఓ అభ్యర్థికి ఓటేసేందుకు అతడి నుంచి నోటో, గిఫ్టో తీసుకుంటే తప్పేమీ కాదని ఏకంగా 80 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారట.

  • Loading...

More Telugu News