: తల్లి మరణం...కూతురు హంతకురాలిని కుంగదీసిందట!
కన్నకూతురును అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఆ తల్లి, తన తల్లి చనిపోతే మాత్రం తట్టుకోలేకపోయిందట. కూతురును కడతేర్చిన కేసులో కటకటాలు లెక్కిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా, తన తల్లి మరణవార్త తెలుసుకుని తీవ్ర విచారంలో కూరుకుపోయిందట. ఈ క్రమంలో దిగ్భ్రాంతికి గురయ్యారని, ఈ కారణంగానే అపస్మారక స్థితిలోకి వెళ్లానని పోలీసులకు వాంగ్మూలమిచ్చింది. తన అపస్మారక స్థితికి ఎలాంటి మందులు కారణం కాదని, అసలు తాను ఎలాంటి ఔషధాలు తీసుకోలేదని కూడా ఆమె వెల్లడించింది. కూతురు షీనా బోరా హత్య కేసులో అరెస్టైన ఇంద్రాణి ముంబైలోని బైకుల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో జైల్లో ఉండగానే ఇంద్రాణి అపస్మారక స్థితిలోకి వెళ్లడం కలకలం రేపింది. అయితే సకాలంలో ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స అనంతరం కోలుకుని నిన్న తిరిగి జైలుకు వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులకు ఆమె పై వాంగ్మూలాన్ని ఇచ్చింది.