: మా వాళ్లు కన్ను తెరిస్తే తట్టుకోలేవ్... జగన్ ‘సోషల్’ కామెంట్లకు లోకేశ్ కౌంటర్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించతలపెట్టిన దీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్న ‘విధ్వంసం’పై టీడీపీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. జగన్ దీక్ష సందర్భంగా ఒక్క ఆందోళన జరిగినా సహించేది లేదని ఆయన వైసీపీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క చోట ఆందోళన జరిగినా, దానిపై కేసు పెట్టి జగన్ ను ఏ-1గా చేర్చేదాకా పోరాడతామని లోకేశ్ ప్రకటించారు. "గుంటూరులో తలపెట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు తగలబెడదాం. కలెక్టర్ ఆఫీసులు ధ్వంసం చేద్దాం. ఆత్మహత్యలకు ప్రేరేపిద్దాం... అంటూ వైసీపీ నేతలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్లకు నేను ఒక్కటే చెబుతున్నా. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క కార్యాలయ అద్దం పగిలినా, ఒక్క యువకుడి బలవన్మరణం జరిగినా, అందుకు జగన్ నే బాధ్యుడిని చేసి కేసులో ఆయనను ఏ-1గా చేర్చేదాకా పోరాడతాం. మాకు మీలాగా దొంగ ఛానెల్, పేపర్ లేవు. 55 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మా వాళ్లు కళ్లు తెరిస్తే తట్టుకోలేవు’’ అంటూ జగన్ ను ఉద్దేశించి లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న గుంటూరుకు వచ్చిన సందర్భంగా లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు పార్టీల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.