: సునామీని సృష్టించిన డచ్ వాసులు!
సముద్రంలో ఐదారు అడుగుల ఎత్తయిన అలలు వస్తుంటే, తీరంలోని గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆ నీరు వందలాది ఎకరాల పంటకు నష్టం కలిగిస్తుంది. ఇక అదే సముద్రపు అల 10 అడుగుల ఎత్తు దాటితే, అడ్డొచ్చిన ప్రాంతాన్నంతా కబళిస్తుంది. ఇక 15 అడుగుల ఎత్తు దాటితే, అది సునామీయే. సముద్ర మట్టానికి ఎగువన ఉన్న ప్రాంతవాసులకు సునామీ, దాని ప్రభావం గురించి తెలుసు. నెదర్లాండ్స్ వంటి దేశాల వాసులకు సునామీల గురించి సరైన సమాచారం, అవగాహన లేవు. ఎందుకంటే నెదర్లాండ్స్ సముద్ర మట్టానికి కాస్తంత దిగువన ఉంటుంది కాబట్టి. ఒకవేళ సునామీ వస్తే ఎలా ఉంటుంది? ఎలా బయటపడాలి? సహాయక చర్యలు ఎలా ఉండాలి? ఈ ఆలోచన అక్కడి శాస్త్రజ్ఞులు కృత్రిమ సునామీని సృష్టించేలా చేసింది. వీరు కనిపెట్టిన 'డెల్టా ఫ్లూమ్' అనే మిషన్ 15 అడుగుల ఎత్తయిన అలలను సృష్టించి పంపుతుంది. ఈ మిషన్ తయారీకి మూడు సంవత్సరాలు పట్టగా, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ కు మూడు నుంచి నాలుగు రెట్ల పెద్ద తటాకంలో పట్టేంతటి నీటిని, అంటే ఒక్కసారిగా 90 లక్షల లీటర్ల నీటిని నెడుతుంది. ఇది సముద్రం నుంచి వచ్చే సాధారణ అలలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ శక్తిని కలిగివుంటుంది. ఈ యంత్రాన్ని ఉపయోగించి కృత్రిమంగా భారీ అలలను సృష్టిస్తూ, వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా వుంటుంది? సునామీ వస్తే ఏం చేయాలన్న విషయాలపై ఆ దేశం పరిశోధనలు చేస్తోంది. నెదర్లాండ్స్ లో వరదల నుంచి రక్షణ అత్యంత ముఖ్యమైన నేపథ్యంలో ఈ ప్రయోగం మంచి అనుభవాన్ని ఇస్తోందని అక్కడి నిపుణులు చెబుతున్నారు.