: పాక్ లో ముగ్గురు ఆల్ ఖైదా మిలిటెంట్లు అరెస్టయ్యారట!... సీటీడీ అధికారి వెల్లడి
ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్థానేనని ప్రపంచ దేశాలు కోడై కూస్తున్నాయి. పాక్ భూభాగం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలకు పెద్దన్నగా భావిస్తున్న ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు కూడా ఆ దేశం ఆశ్రయమిచ్చింది. దీనిపై స్పష్టమైన సమాచారం సేకరించిన అగ్రరాజ్యం అమెరికా పాక్ అనుమతి లేకుండానే ఆ దేశ భూభాగంలోకి చొరబడి లాడెన్ ను మట్టుబెట్టింది. అలాంటి దేశంలో ఆల్ ఖైదాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టయ్యారట. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా, సాక్షాత్తు ఆ దేశ ఉగ్రవాద వ్యతిరేక విభాగం (సీటీడీ) అధికారి ఒకరు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో నమ్మక తప్పడం లేదు. పంజాబ్ రాష్ట్రంలోని రాయి విండ్ లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేశామని ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నామని ఆ అధికారి చెప్పారు. పట్టుబడ్డ ఉగ్రవాదులను తాకీఖ్ అజీజ్, అబ్దుల్ గఫార్, మెహర్ హమీద్ లుగా పేర్కొన్న సదరు అధికారి ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, ఆయుధాలు, ఉగ్రవాద సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని లోకల్ మీడియాకు తెలిపారు. ఆల్ ఖైదాకు నిధులు సమకూర్చే పనిపై వచ్చిన వారిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు.