: ధనిక రాష్ట్రంలో రూ.10 స్టాంప్ పేపర్లకు చెల్లుచీటి...స్టాకు అయిపోగానే రద్దు చేస్తారట
దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రెండో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో, ఇకపై రాష్ట్రంలో రూ.10 నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అధీకృత స్టాంప్ వెండర్ల వద్ద ఉన్న స్టాక్ అయిపోగానే, వెనువెంటనే రూ.10 స్టాంప్ పేపర్లపై నిషేధం విధించనున్నట్లు నిన్న తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాల జారీ కోసం ఆయా వ్యక్తులు ఇప్పటిదాకా రూ.10 స్టాంప్ పేపర్ పై అఫిడవిట్ ఇచ్చేవారు. ఈ అఫిడవిట్ల కోసం ఇకపై రూ.20 స్టాంప్ పేపర్లను వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంటే, ఇకపై తెలంగాణలో రూ.10 స్టాంప్ పేపర్లు కనిపించబోవన్న మాట.