: వైకాపాకు ఎదురుదెబ్బ... టీడీపీలోకి జమ్మలమడుగు ఎమ్మెల్యే!
వైఎస్ఆర్ కడప జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే, వైకాపా నేత సి.ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఆయనే స్వయంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని తెదేపా కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృత నిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. అదే ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి మాత్రం, ఆదినారాయణ చేరికను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారని తెలిసింది. తన పినతండ్రితో పాటు 150 మందికి పైగా తెదేపా కార్యకర్తలను హత్య చేసిన వారి నేతను ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించినా, పార్టీ భవిష్యత్ అవసరాల కోసం తప్పదని లోకేష్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైకాపా అధినేత జగన్ ను దెబ్బతీయాలంటే, ఆది చేరిక ఎంతో ముఖ్యమని, మరికొంత మంది నేతలనూ టీడీపీలో చేర్చుకోవాలని ఆయన భావిస్తున్నారట. కాగా, జమ్మలమడుగు ప్రాంతంలో గత ఐదారు రోజులుగా ఊరూరూ తిరుగుతున్న ఆదినారాయణ రెడ్డి కార్యకర్తలతో మంతనాలు జరుపుతూ పార్టీ మారే విషయమై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.