: బెయిల్ కోసమే నాటకాలా?... ఇంద్రాణి అనారోగ్యంపై పోలీసుల అనుమానం
సొంత కూతురినే అత్యంత దారుణంగా హతమార్చి కటకటాలపాలైన ఇంద్రాణి ముఖర్జియా నాటకాలాడి బెయిల్ పొందాలని చూస్తోందా? అంటే అవుననే అంటున్నాయి బైకుల్లా జైలు అధికార వర్గాలు. ఈ దిశగా ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నేడు ఇంద్రాణి నుంచి కీలక వాంగ్మూలం సేకరించనున్నారు. జైల్లో ఉండగానే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన జైలు అధికారులు ఆమెను హుటాహుటిన జేజే ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఇంద్రాణి స్పృహలోకొచ్చింది. నిన్న తనను ప్రశ్నించిన పోలీసు అధికారులకు ఆమె ఆసక్తికర వాదనను చెప్పింది. తాను ఎలాంటి ఔషధాలు తీసుకోలేదని ఆమె చెప్పిందట. మరి ఉన్నట్టుండి అనారోగ్యానికి ఎలా గురయ్యారని పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో పొంతనలేని సమాధానాలు రావడంతో బెయిల్ పొందేందుకే ఆమె నాటకాలాడిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే నేడు ఇంద్రాణి నుంచి అధికారికంగా వాంగ్మూలం సేకరించనున్న జైలు అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.