: హస్తినలో గవర్నర్ బిజీబిజీ... నేడు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు కూడా దేశ రాజధాని ఢిల్లీలోనే పర్యటించనున్నారు. నిన్న ఉదయం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, హోం మంత్రికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. అలాగే, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరుషితోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్న గవర్నర్ నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇంకా పలువురు కేంద్ర మంత్రులను కూడా గవర్నర్ కలవనున్నట్లు తెలుస్తోంది.