: ట్విట్టర్ కు యూపీ ఖాకీల నోటీసులు... ‘దాద్రి’ పోస్ట్ లను తొలగించాలని హుకుం


సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ‘ట్విట్టర్’కు నిన్న ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ‘దాద్రి’ ఘటనకు సంబంధించి పోస్టయిన ఉద్రేకపూరిత వ్యాఖ్యానాలతో పాటు ఫొటోలను తక్షణమే తొలగించాలని యూపీ ఖాకీలు ట్విట్టర్ కు హుకుం జారీ చేశారు. పశుమాంసం తిన్నారనే కారణంగా దాద్రికి చెందిన అక్లాక్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనానికి తెర లేపింది. బాధిత కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఈ ఘటనకు రాజకీయ రంగు పులమొద్దని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాల వారు ఈ ఘటనపై ఘాటుగా స్పందిస్తూ ట్విట్టర్ లో ఫొటోలతో పాటు ఆవేశపూరిత వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ల కారణంగా అల్లర్లు చెలరేగే ప్రమాదముందని భావిస్తున్న యూపీ పోలీసులు సదరు పోస్టులను తొలగించాల్సిందిగా ట్విట్టర్ ను ఆదేశించారు.

  • Loading...

More Telugu News