: సీనియర్ ఐపీఎస్ ఇంటిలో ఆరడుగుల జెర్రిపోతు... అరగంట శ్రమించి పట్టేసిన కానిస్టేబుల్
తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆ రాష్ట్ర అదనపు డీజీ (లా అండ్ ఆర్డర్) సుదీప్ లక్డాకియా కుటుంబ సభ్యులు నిన్న తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే, ఆ ఇంటిలోకి ఆరడుగుల జెర్రిపోతు దూరిందట. సమాచారం అందుకున్న ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి దాదాపు అరగంట పాటు శ్రమించి ఆ పామును పట్టేశాడు. దీంతో లక్డాకియా కుటుంబం ఊపిరి పీల్చుకుంది. వివరాల్లోకెళితే... సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన లక్డాకియాకు ప్రభుత్వం తెలంగాణ డీజీపీ కార్యాలయం సమీపంలోని బంగ్లాను కేటాయించింది. నిన్న మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓ జెర్రిపోతు ఆ ఇంటిలోకి దూరంది. అసలే పాము, ఆపై ఆరడుగుల పొడవు ఉన్న ఆ సర్పాన్ని చూసి లక్డాకియా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పాములు పట్టడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన కానిస్టేబుల్ వెంకటేశ్ నాయక్ (చిలకలగూడ పీఎస్ లో పనిచేస్తున్నారు) ను పిలిపించారు. అక్కడికి చేరుకున్న వెంకటేశ్ నాయక్ అరగంట పాటు ఆ ఇంటిని జల్లెడ పట్టి, ఎక్కడో దాక్కున్న ఆ సర్పాన్ని పట్టేశాడు. అనంతరం ‘ఫ్రెండ్ ఆఫ్ స్నేక్ సొసైటీ’కి దానిని అప్పగించారు.