: కేసీఆర్ సర్కారుపై ‘దండయాత్ర’కు బీజమెలా పడిందంటే...!
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తొలుత దూకుడు ప్రదర్శించిన అధికార పక్షం వెనువెంటనే ఆత్మరక్షణలో పడిపోయింది. గత వారం బుధవారం దాకా రైతు ఆత్మహత్యలపై చర్చకు తానే తెర తీసిన ప్రభుత్వం సభలోని అన్ని విపక్షాలపైనా పైచేయి సాధించింది. ప్రభుత్వాన్ని నిలదీయడంలో విపక్షాలన్నీ విఫలమయ్యాయి. అయితే బుధవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్సైంది. పార్టీ విభేదాలను పక్కనబెట్టిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ ఒక్కటయ్యాయి. సర్కారుపై దండయాత్ర చేశాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం దాకా ఎదురే లేకుండా సాగిన ప్రభుత్వం సాయంత్రమయ్యే సరికి సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటిపోవడానికి గల కారణమేమిటని సాక్షాత్తు సీఎం కేసీఆర్ మంత్రులను, పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలను నిలదీశారు. అసలు జరిగిన విషయమేమిటంటే... రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టలేకపోయామని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అంతర్మథనంలో పడిపోయారు. సీఎల్పీలోని తన చాంబర్ లో ఆయన ఇదే విషయంపై తన పార్టీ సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మదిలో ఓ మంచి ఐడియా మెదిలింది. వెనువెంటనే టీడీపీ, బీజేపీ, వైసీపీ, వామపక్షాల శాసనసభాపక్ష నేతలను తన కార్యాలయానికి పిలిపించారు. సీనియర్ సభ్యుడైన జానారెడ్డి నుంచి ఆహ్వానం అందడంతో టీడీపీ సహా అన్ని పార్టీల నేతలూ పార్టీ విభేదాలను పక్కనబెట్టి సీఎల్పీకి తరలివెళ్లారు. విపక్షాలన్నీ మూకుమ్మడిగా దాడికి దిగితే తప్పించి ప్రభుత్వం దారికి రాదని జానారెడ్డి మిగిలిన పార్టీల నేతలకు చెప్పారట. దీనికి అంతా సై అన్నారు. వెనువెంటనే అసెంబ్లీకి వెళ్లి రైతుల రుణమాఫీపై ‘సింగిల్ సెటిల్ మెంట్’కు పట్టుబట్టారు. ఊహించని పరిణామానికి అధికార పక్షం గుక్క తిప్పుకోలేకపోయింది. ఆ మరునాడు కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాలని జానారెడ్డి మిగిలిన పార్టీ నేతలకు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న కారణంగానే గురువారం నాటి సమావేశాల్లో అధికారపక్షం కాస్తంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. విపక్షాలు పూర్తి స్థాయిలో గళం విప్పకముందే సభను కేవలం ఏడు నిమిషాలకే వాయిదా వేయించింది. తమను ఆత్మరక్షణలో పడేసిన వ్యూహానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జానారెడ్డేనని తెలిసిన అధికార పక్షం నేటి సస్పెన్షన్ జాబితాలో ఆయన పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. మరి దీని వెనుక ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందేమో చూడాలి.