: చంద్రబాబు ఇలాకాలో రఘువీరాకు చేదు అనుభవం
ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా బందరు పోర్టుకు భూములివ్వమన్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన రఘువీరాపై మట్టి దాడి జరిగింది. నిన్నటికి నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో రఘువీరా పర్యటనలో పావురాలను తారాజువ్వలకు కట్టి ఎగురవేసిన ఘటనపై ఆ జిల్లా పోలీసులు డీసీసీ అధ్యక్షుడు, పటాసుల తయారీదారుపై కేసు పెట్టారు. ఈ ఘటనలో తన కళ్ల ముందే ఈ తతంగం జరుగుతున్నా రఘువీరా నోరు విప్పలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రఘువీరాకు చేదు అనుభవం ఎదురైంది. నేటి ఉదయం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన రఘువీరారెడ్డి కుప్పం నియోకవర్గానికి వెళ్లారు. అయితే కుప్పంలో ఊహించని విధంగా రఘువీరారెడ్డిని టీడీపీ కార్యాకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.