: లిక్కర్ మాఫియా జోలికెళ్తే ‘అండమాన్’కు వెళ్లాల్సిందే!...మార్కాపురం ఘటనే నిదర్శనం


ఏపీ ఎక్సైజ్ శాఖ వ్యవహారాలు సీఎం నారా చంద్రబాబునాయుడుకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ శాఖ అధికారుల వ్యవహార సరళి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఆ శాఖ అధికారులు సాక్షాత్తు ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట ఏమాత్రం వినడం లేదు. కొన్ని సందర్భాల్లో మంత్రికి తెలియకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు నడుం బిగించారు. కమిషనర్ తో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ను కూడా బదిలీ చేసి వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. ఈ వ్యవహారంపై కాస్తంత లోతుగా దర్యాప్తు చేసిన ప్రభుత్వానికి విస్తుగొలిపే వాస్తవాలు తెలిశాయి. రాష్ట్రంలో లిక్కర్ మాఫియాను ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అంతేకాదు, మాఫియాపై ఎవరైనా తెలియకుండా తనిఖీలకు వెళితే మాత్రం వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కన్నెర్రజేయడంతో సరిపెట్టని ఆ శాఖ బాసులు తమకు ప్రీతిపాత్రమైన మాఫియాపై దాడులకు వెళ్లే కింది స్థాయి అధికారులను అండమాన్ దీవులకు పంపడానికి కూడా వెనుకాడటం లేదు. అయినా, ఏపీ లిక్కర్ మాఫియాకు, అండమాన్ కు పంపడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే, అస్సలు లేదట. కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా తమకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని అండమాన్ పంపిస్తున్నారట. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ఫిర్యాదుపై స్పందించిన ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ కానిస్టేబుల్ తనిఖీలకు వెళ్లారట. అంతే, విషయం తెలుసుకున్న శాఖ మార్కాపురం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కానిస్టేబుల్ కు ‘అండమాన్ పాస్ పోర్టు’ ఇచ్చారట. అదేంటంటే, అండమాన్, నికోబార్ దీవుల్లో నాటుసారా తయారీ, క్రయవిక్రయాలపై సమాచారం సేకరించుకుని రావాలని కానిస్టేబుల్ కు జారీ చేసిన శ్రీముఖంలో ఆ అధికారి పేర్కొన్నారట.

  • Loading...

More Telugu News