: గోమాతను కాపాడేందుకు ముస్లిం యువకుని సాహసం
గోవులను చంపి తింటున్నారని ముస్లింలపై దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల నిరసనలు, దాడులు జరుగుతున్న వేళ.. అదే వర్గానికి చెందిన ఓ యువకుడు ఓ ఆవు ప్రాణాలు కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్న ఘటన లక్నో సమీపంలో జరిగింది. 35 అడుగుల లోతైన బావిలో ఓ ఆవు పడిపోగా, దాన్ని కాపాడే సాహసం చేయలేక అందరూ చూస్తున్న వేళ, 20 సంవత్సరాల మహమ్మద్ జకీ తన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. గోమాతను కాపాడేందుకు బావిలోకి దిగాడు. బలమైన తాళ్ల సాయంతో దాన్ని కట్టి క్రేన్ వచ్చే వరకూ ఆగి, ఆపై దాన్ని వెలుపలికి తీసుకొచ్చి అందరితో ప్రశంసలు పొందాడు. "ఆ ఆవు ప్రాణాలు అపాయంలో పడ్డాయి కాబట్టే నేను రిస్క్ చేశాను. అప్పటికే దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ ఆవు నాపై దాడి చేసింది. నా కాలును కొట్టింది. అయినా పట్టు విడవకుండా దాని ప్రాణాలు కాపాడాలనే నిర్ణయించుకున్నా" అని వెలుపలికి వచ్చిన తరువాత జకీ వివరించాడు. అయితే, బావిలోకి దిగేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పిన క్రేన్ యజమాని ప్రేమ్ కుమార్ వారికన్నా ముందు జకీ లోపలికి దూకాడని తెలిపారు. జకీ చేసిన పనిని అతని అమ్మ మెచ్చుకుంది. "నా కొడుకు చదువుకున్నాడు. మిగతావారిలా ఒకటికి రెండుసార్లు ఆలోచించలేదు. బావిలోకి దిగిన తరువాత అతని ప్రాణాలపై ఆందోళన కలిగింది. చివరికి ఆవు ప్రాణాలతో బయటపడింది. సంతోషం. గత సంవత్సరం రామ్ లీలా ఉత్సవాల సమయంలో కొన్ని ఇళ్లకు నిప్పంటుకున్నప్పుడు కూడా నా కుమారుడు ప్రాణాలకు తెగించి సాహసం చేసి కొంతమందిని కాపాడాడు" అని తెలిపింది.