: అది నా ప్రైవేటు జీవితం: 'పేకాట'పై టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ
తాను పేకాట ఆడుతూ కాలం గడుపుతానని వస్తున్న వార్తలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ఖండించారు. తెలుగు టెలివిజన్ చానల్ 'టీవీ-9'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పేకాట వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "ఇది చాలా తప్పుడు ఆలోచన. మేం పుట్టి పెరిగినటువంటి వాతావరణం, మా కుటుంబ నేపథ్యం, మా సంప్రదాయం, మా కుండే సర్కిల్ వాటన్నింటిల్లో... మాకుండే ప్రైవేటు జీవితంలో ఇలాంటివి అడిషనల్ కార్యక్రమాలు. బహిరంగంగానో, ప్రజలకు నష్టం కలిగేలానో, ఇబ్బంది కలిగేలాగానో రమణ అనే వ్యక్తి ఏ కార్యక్రమాలూ చేయరు. ఎప్పుడూ చేయలేదు కూడా. 9 సార్లు ఎన్నికల్లో పాలు పంచుకున్నా, మూడు సార్లు గెలిచా" అన్నారు. దీనికి కొనసాగింపుగా, ప్రజాజీవితంలోకి వచ్చిన తరువాత ప్రైవేటు లైఫ్ లు ఉంటాయంటారా? అని ప్రశ్నించగా, "మా కుటుంబ నేపథ్యం, కుటుంబంతోనే సరదాగా ఉండటం, వాళ్లతో ఆమాత్రం కాలక్షేపం చేయనీయకుండా... ఆరోపణలేంటి?" అని ప్రశ్నించారు. ఇటీవల కేరళలో మీరు పేకాట ఆడి రూ. 70 లక్షలు గెలుచుకున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి... నిజమా? అబద్ధమా? అని ప్రశ్నించగా, "అన్నీ తప్పుడు ఆలోచనలతో చేస్తున్న విమర్శలే. కేరళ వెళ్లింది లేదు, ఆడింది లేదు" అన్నారు. పేకాటలో మీరు అంత మంచి ప్లేయరా? అని అడుగగా, "చిన్నప్పటి నుంచి జగిత్యాల క్లబ్ మెంబర్ని, హైదరాబాద్ లో కూడా క్లబ్ మెంబర్ గా ఉన్నాము. సరదాగా ఫ్రెండ్స్ తో గడుపుతాను. దాన్ని రాజకీయాలకు వర్తించడం బాధాకరమైన అంశం. పార్టీ ప్రశ్నించే విధంగా ఎప్పుడూ ప్రయత్నించ లేదు" అన్నారు.