: ఉద్యోగులకు కేంద్రం బంపర్ ఆఫర్... సెలవులిచ్చి ‘యాత్ర’లకు పోయిరమ్మంటున్న వైనం
అవును, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘అడవులకు వెళ్లండి...సాహస యాత్రలు చేయండి’ అంటూ ప్రభుత్వం ఉద్యోగులను ఊరిస్తోంది. ట్రెక్కింగ్, పర్వతారోహణ, ఎడారి యాత్ర, పడవ ప్రయాణం తదితరాలకు వెళ్లిరండని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఈ మేరకు ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకోసం సెలవుతో పాటు రూ.20 వేల నగదు కూడా ఇస్తామని ఆ శాఖ ఉద్యోగులకు ఆఫరిచ్చింది. అయినా సెలవులిచ్చి, డబ్బులిచ్చి యాత్రలు చేయమని ప్రభుత్వం ఎందుకు చెబుతుందో తెలుసా? వృత్తి జీవితంలో ఒత్తిడిని జయించి , సవాళ్లను ఎదుర్కొనేలా ఉద్యోగుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకేనట. ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు ఈ తరహా వినూత్న ఆఫర్లను తమ ఉద్యోగులకు ఇస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం కూడా కార్పొరేట్ సంస్థల తరహాలోనే తమ ఉద్యోగులను రీచార్జి చేసేందుకు ఈ వినూత్న చర్యకు శ్రీకారం చుట్టింది. సాహస యాత్రలకు వెళ్లి వచ్చే ఉద్యోగులు ఆరోగ్యంగానూ ఉంటారని, తద్వారా సెలవులు కూడా తక్కువగా తీసుకుంటారని మోదీ ప్రభుత్వం లెక్కలేస్తోంది.