: దెయ్యం భయం... పాఠశాల వైపు కన్నెత్తి చూడని విద్యార్థులు
బడి కెళ్లం మేము.. అక్కడ దెయ్యం ఉందంటూ ఓ పాఠశాల విద్యార్థులు భయపడుతున్న సంఘటన విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలంలోని ఓబర్తిలో చోటుచేసుకుంది. దీంతో బడికి తాళం పడింది. పదిహేను రోజుల క్రితం విద్యార్థులతో కళకళలాడిన ఈ పాఠశాల నేడు బోసిపోయింది. దెయ్యం లేదు గియ్యము లేదంటూ టీచర్లు ఎంతగా నచ్చజెప్పినా విద్యార్థులు వినటం లేదు. అసలు, ఈ దెయ్యం సంఘటనకు కారణమేమిటంటే.. కొన్ని రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన భీములమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. గ్రామంలోని శ్మశానంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, పాఠశాలకు, శ్మశానానికి వెళ్లే మార్గం ఒకటే. దీంతో విద్యార్థులు ఆ మార్గం గుండా వెళ్లాలంటే భయంగా ఉందని, తమపై భీములమ్మ రాళ్లు రువ్వుతోందంటూ విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. దెయ్యంగా మారిని భీములమ్మ గ్రామంలోని ఒక ఇంట్లో ఉందంటూ గ్రామస్తులు ఆ ఇంటిని కూడా తగులబెట్టడం విశేషం!