: అక్కడ మనదే... ఇక్కడ కూడా కదలండి: కార్యకర్తలకు బాబు ఉపదేశం
మరో మూడున్నరేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుందన్న దానిలో ఎంతమాత్రమూ సందేహం లేదని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవాల్సిన బాధ్యత నూతన కమిటీదేనని అన్నారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత ప్రభుత్వాల పనితీరును ఎండగట్టాలని కోరారు. తెలుగుదేశం పార్టీ త్యాగాలకు మారుపేరు అని వ్యాఖ్యానించిన ఆయన, చెప్పింది చెప్పినట్టు ఆచరించే పార్టీ తమదేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వం ద్వారా రూ. 55 కోట్లు సమకూర్చుకున్న ఏకైక పార్టీ టీడీపీయేనని అన్నారు. ఇతర పార్టీలు తమను అనుకరించాలని చూసి అపహాస్యం పాలయ్యారని ఎద్దేవా చేశారు. కార్యకర్తల త్యాగాల వల్లే నేతలకు పదవులు దక్కాయని, ఏవైనా తేడాలు వస్తే అవే పదవులకు వారు దూరమవుతారని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నందున ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసేందుకు కార్యకర్తల అండతో కమిటీ సభ్యులు కదలాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.