: మారుమోగుతున్న నారా లోకేష్ పేరు!
ఎవరి నోట విన్నా లోకేష్ పేరే. ఏ ఇద్దరి మధ్య చర్చ జరిగినా అది లోకేష్ గురించే. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా కేంద్ర కమిటీ, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీల ప్రమాణ స్వీకారం జరుగగా, తెలుగు తమ్ముళ్లు లోకేష్ నామజపం చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలంతా ముందు వరుసలో నిలబడగా, వెనకవైపు రెండో వరుసలో నిలుచున్న లోకేష్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా అందరితో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ యువనేత, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో యువతను కలిపి ఉంచేది ఆయనేనని ఈ సందర్భంగా ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. ఆయనపై యువకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, లోకేష్ వాటిని నిలుపుకుంటూ, పార్టీని ముందుకు నడిపిస్తారని కచ్చితంగా నమ్ముతున్నట్టు తెలిపారు. భవిష్యత్తును నిర్ణయించేది యువతేనని, ఈ దిశగా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబును ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. లోకేష్ కు బొకేలు ఇచ్చి, శాలువాలు కప్పి అభినందించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పోటీ పడ్డారు. లోకేష్ సైతం వారందరితో మమేకమై, కుశల ప్రశ్నలు వేసి, ఫోటోలు దిగుతూ కనిపించారు.