: తెదేపా కమిటీల ప్రమాణ స్వీకార పత్రంలో ఏముందంటే..!
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ కమిటీల్లో ఎంపికైన వారందరిచేతా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ పాఠం ఇది. "డాష్ అను నేను (డాష్ అన్న చోట ఎవరి పేరు వారు చదువుకోవాలి) తెలుగుదేశం పార్టీ డాష్ సభ్యునిగా (ఇక్కడ డాష్ అన్న చోట వ్యక్తి కమిటీ, పదవిని చెప్పుకోవాలి) పార్టీ నిర్ణయాలను, ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ, పార్టీ పట్ల పూర్తి విధేయతతో, పార్టీ పటిష్ఠతకు నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన భారతావని సాక్షిగా పవిత్ర రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ సాక్షిగా, నీతి, నిజాయతీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నైతిక విలువలతో, కుల, మత, వర్గం ప్రాంతీయ తత్వాలకు అతీతంగా, పేదరిక నిర్మూలనకు, రైతు వికాసం మరియు సర్వప్రజల సంక్షేమానికి, ఆదర్శవంతమైన సమాజం కొరకు అవిరళ కృషి చేస్తాను. ప్రజా జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రజాసేవే పరమావధిగా పార్టీ నియమాలను అనుసరించి తెలుగు జాతి సమగ్ర ప్రయోజన పరిరక్షణకు కృషి చేస్తాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, ఆత్మ విశ్వాసంతో పురోగమిస్తూ, శాంతి, సౌభాగ్యాలతో కూడిన సమసమాజ అభివృద్ధికి అవిశ్రాంతంగా మనసా, వాచా, కర్మేణా కృషి చేస్తానని, మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని చదివించారు.