: బ్యాంకు డిపాజిట్లకు, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకూ లింకు... మోదీ సర్కారు కొత్త ఆలోచన!
ఉద్యోగుల పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలపై వచ్చే వడ్డీ మొత్తాలను బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు ఆర్బీఐ రెపో రేటుకు అనుగుణంగా ప్రతి త్రైమాసికం లేదా ఆరు నెలలకు ఒకసారి వడ్డీలను మార్చుతూ, చిన్న మొత్తాల డిపాజిట్లుగా వీటిని మార్చాలని సరికొత్త ఆలోచన చేస్తోంది. దేశంలోని గృహస్తుల నుంచి మరింతగా పొదుపు మొత్తాలను ఆహ్వానించాలని భావిస్తున్న ఆర్థిక శాఖ, ప్రస్తుతం అమలవుతున్న వార్షిక వడ్డీ రేట్ల సమీక్ష స్థానంలో మూడు నెలలకు ఒకసారి వడ్డీలను సవరించాలన్న యోచనలో ఉంది. "దేశంలో నిర్మాణ రంగంలో రేట్లు అత్యధికంగా ఉన్నాయి. ఈ విభాగంలో కరెక్షన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో చిన్న మొత్తాల పొదుపుపై, బ్యాంకుల డిపాజిట్లపై అనుసరిస్తున్న విధానం మారాల్సి ఉంది" అని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం పలు ఆప్షన్లను తమ శాఖ పరిశీలిస్తోందని, వాటిల్లో భాగంగానే వచ్చే వడ్డీలను బ్యాంకు డిపాజిట్లతో అనుసంధానం చేయాలన్న నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు.