: పోలీసులను హతమార్చండి... పటేల్ యువతకు హార్దిక్ వివాదాస్పద సలహా!
గుజరాత్ లో పటేల్ వర్గానికి యువనేతగా అనతికాలంలోనే పేరు తెచ్చకున్న హార్దిక్ పటేల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు చేసుకునే బదులు పోలీసులను హత్య చేయాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. "మీరు ధైర్యవంతులైతే... వెళ్లి ఓ ఇద్దరు ముగ్గురు పోలీసులను చంపేయండి. పటేళ్లు ఎన్నడూ ఆత్మహత్యలు చేసుకోరు" అంటూ ఆయన సూరత్ యువతకు పిలుపునిచ్చారు. పటేళ్లకు రిజర్వేషన్లకై జరుగుతున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ, తాను ఆత్మహత్య చేసుకుంటానని విపుల్ దేశాయ్ అనే యువకుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో, దేశాయ్ ఇంటికి హార్దిక్ పటేల్ వెళ్లాడు. అక్కడే ప్రసంగిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, పటేళ్లకు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన సర్దార్ పటేల్ గ్రూప్ కన్వీనర్ లాల్జీ పటేల్ మాత్రం హార్దిక్ సలహాను ఖండించారు. "మా నిరసనలు గాంధీ మార్గంలో సాగుతాయి. ఎవరినీ హత్య చేయమని మేము చెప్పబోము. ఇది సరైన సలహా కాదు. సంఘంలో అలజడి సృష్టించే ఈ తరహా వ్యాఖ్యలను ఆయన విరమించుకోవాలి" అని లాల్జీ సలహా ఇచ్చారు. కాగా, తాను ఈ తరహా సలహాలు ఇవ్వలేదని ఆ తర్వాత హార్దిక్ తెలిపారు. తాను ఆ మాటలు చెప్పినట్టు ఏదైనా సాక్ష్యముంటే చర్యలు తీసుకోవచ్చని అన్నారు.