: తిరుమల కిటకిట... భక్తుల కటకట!


నిత్యమూ ఏడుకొండల వాడి నామస్మరణతో మారుమోగే తిరుమల గిరుల్లో, ఇప్పుడు భక్తుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. రోజుకు 85 వేల మందికి స్వామివారి దర్శనం లభిస్తుండగా, సప్తగిరులపై రెండు లక్షల మంది వేచిచూస్తుండటమే ఇందుకు కారణం. వసతి సౌకర్యాలు లభించకపోవడం, కనీసం ఆరుబయట విశ్రాంతి తీసుకుందామంటే, భారీ వర్షాలు కురుస్తుండటం భక్తులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. తిరుమలకు వచ్చిన భక్తులు కనీసం వర్షంలో తడవకుండా ఉండేందుకు కూడా వీలులేనంతగా కిక్కిరిసిపోగా, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల తిరుగు ప్రయాణానికి సైతం బస్సులు అంతంతమాత్రంగానే ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వీఐపీ దర్శనాలను రద్దు చేసినప్పటికీ, తిరుమలపై భక్తుల రద్దీ ఎంతమాత్రమూ తగ్గలేదు. నిన్నటి నుంచి పలుమార్లు వర్షం కురవడంతో క్యూలైన్లలోని భక్తులు తడిసి ముద్దయ్యారు. కాలిబాట కిటకిటలాడగా, దాదాపు 40 వేల మంది ఆ మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం ఒక్కరోజే తిరుమలకు 2.50 లక్షల మంది వచ్చారని, వీరికి దర్శనం పూర్తయ్యే సరికి సోమవారం సాయంత్రం అవుతుందని టీటీడీ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ ప్రకటించారు. భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భారీ వర్షాల కారణంగా భక్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 31 కంపార్టుమెంట్లు నిండిన సాధారణ భక్తుల క్యూలైన్ బయట రెండు కిలోమీటర్లు పెరిగిందని పేర్కొన్నారు. పెరటాసి మాసం నడుస్తుండటం, తమిళనాట దసరా సెలవులు ముందుగానే ఇవ్వడంతో, తమిళ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News