: విజయానికి కారణం ఆ ఓవరే: డుమిని
తొలి టీట్వంటీలో విజయానికి 16వ ఓవరే కారణమని జేపీ డుమిని తెలిపాడు. అప్పటి వరకు భారత్ మెరుగైన స్థితిలో ఉందని చెప్పిన డుమిని, 16వ ఓవర్ లో మూడు సిక్స్ లు మ్యాచ్ గమనాన్ని మార్చివేశాయని చెప్పాడు. అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్ లో సౌతాఫ్రికా 22 పరుగులు సాధించింది. దీంతో ఒక్కసారిగా రెండు జట్ల స్కోరు బోర్డు మధ్య వ్యత్యాసం తగ్గింది. ఆ ఓవర్ స్పూర్తితో తరువాత నాలుగు ఓవర్లు బాగా ఆడామని, దీంతో విజయం సాధించామని డుమిని చెప్పాడు. ఈ విజయం మరింత ఉత్సాహం ఇస్తుందని, ఇలాంటి ప్రారంభమే తమకు కావాల్సిందని డుమిని పేర్కొన్నాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని కితాబునిచ్చాడు. భారత్ లో మంచి ప్రదర్శనకు ఐపీఎల్ చాలా ఉపయోగపడిందని డుమిని తెలిపాడు.