: సగం స్పృహలో ఇంద్రాణి... మరో మూడు రోజులు ఆసుపత్రిలోనే
కన్న కూతురు షీనా బోరాను హత్య చేశారన్న ఆరోపణలతో, బైకలా జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా ఫిట్స్ కు వాడే మాత్రలు అధికంగా తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ముంబైలోని జేజే ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె సగం స్పృహలో ఉన్నారని, మరో మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని హాస్పిటల్ డీన్ టీపీ లహానే తెలిపారు. ఇంద్రాణికి అవసరమైన రక్త, మూత్ర పరీక్షలు చేయించామని... ఆమె ఆరోగ్య పరిస్థితిని సీబీఐకి తెలిపామని వెల్లడించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఇంద్రాణి పరిస్థితి విషమంగా ఉందని... ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని లహానే తెలిపారు. ఫిట్స్ నిరోధానికి ఆమె వైద్యం చేయించుకుంటున్నారని... ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వాడాల్సిన ట్యాబ్లెట్లను ఆమె అధిక మోతాదులో తీసుకున్నారని వైద్యులు చెప్పారు. అందువల్లే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారని తెలిపారు. ఇన్ని మాత్రలు ఆమె దగ్గర ఎలా ఉన్నాయో తెలియడం లేదని ఓ సీనియర్ డాక్టర్ అన్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.