: హైదరాబాదులో ‘ఆపరేషన్ మిడ్ నైట్ రోమియోస్’... 31 మంది రోమియోల అరెస్ట్
హైదరాబాదులో ఆకతాయి యువకులకు ముకుతాడు వేసేందుకు పోలీసులు వరుస ఆపరేషన్లను చేపడుతున్నారు. ఇప్పటికే బైక్ రేసింగ్ లకు దిగుతూ అర్ధరాత్రి నగర వీధుల్లో బీభత్సం సృష్టిస్తున్న యువకులకు కళ్లెం వేసిన పోలీసులు, తాజాగా ఇటీవల ‘ఆపరేషన్ మిడ్ నైట్ రోమియోస్’ పేరిట ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెట్టారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత రోడ్లపైకి వస్తున్న యువకులు తమకు కనిపించిన వారిపై మాటల దాడులతో పాటు మహిళలపై జుగుప్సాకర కామెంట్లు విసురుతున్నారు. ఇటీవల పాతబస్తీలో చేపట్టిన ఆపరేషన్ మెరుగైన ఫలితాలనిచ్చిందట. దీంతో ఈ ఆపరేషన్ ను పాతబస్తీవ్యాప్తం చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఓల్డ్ సిటీలో చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా 31 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. పోకిరీలతో పాటు వారి తల్లిదండ్రులను కూడా కౌన్సెలింగ్ కు పిలవనున్నారట.