: కోల్ బ్లాక్ కేటాయింపులో నేనెవరినీ ప్రభావితం చేయలేదు: మన్మోహన్ సింగ్
బొగ్గు క్షేత్రాల కేటాయింపు స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిల్లీలోని సీబీఐ కోర్టులో ఈరోజు తన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి కోల్ బ్లాక్ కేటాయించే విషయంలో తానెవరినీ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించలేదని తెలిపారు. అంతేగాక బిర్లాకు గనుల కేటాయింపు చేస్తానని ఎవరికీ హామీ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. అందుకోసం బిర్లా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లు తనకు రాసిన లేఖలను నిశిత పరిశీలన కోసం సంబంధిత శాఖలకు పంపించినట్టు వివరించారు. ఈ వ్యవహారంలో తానెక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని మన్మోహన్ స్పష్టం చేశారు. ఇదిలాఉంటే ఈ కేసులో సీబీఐ ఆయనకు ఇటీవలే క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.