: ఇది మతపరమైన హత్య... ప్రణాళిక ప్రకారం చేసింది: ఒవైసీ
ఆవు మాంసం తిన్నాడనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ లో 52 ఏళ్ల ముస్లిం వ్యక్తిని కొంత మంది కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన మతపరమైన హత్య అని ఆరోపించారు. హత్యకు గురైన మొహమ్మద్ నివాసానికి ఈ ఉదయం వెళ్లిన అసద్.. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ హత్య సెక్యులరిజానికి వ్యతిరేకంగా జరిగిందని అన్నారు. ఇలాంటి ఘటనల వల్ల సోదరభావం దెబ్బతింటుందని చెప్పారు. ముస్లిం అయినందువల్లే మొహమ్మద్ ను చంపేశారని ఆరోపించారు. ఇదే సమయంలో సమాజ్ వాది ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. మొహమ్మద్ ఇంట్లోని మాంసం బీఫా? కాదా? అని విచారణ జరుపుతున్నారని... బాధితులను నిందితులుగా పరిగణిస్తున్నారని మండిపడ్డారు.