: కోట్లు సంపాదించే ఆ కిటుకేంటో చంద్రబాబు చెప్పాలి: ఎమ్మెల్యే రోజా
ఇటీవల కుటుంబ ఆస్తులు ప్రకటించిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ, పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని, జీవితం ఇలానే చాలా బాగుందని అన్నారు. ఆ మాటలపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. పాలు, కూరగాయలతో కోట్లు సంపాదించే కిటుకేంటో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి హెరిటేజ్ కు పాలు అమ్మిన రైతులెందుకు కోటీశ్వరులు కావడంలేదని సూటిగా ప్రశ్నించారు. తిరుమలలో ఈ మేరకు విలేకరులతో రోజా మాట్లాడారు. నారాయణ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఇంతవరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేయరని సూటిగా ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన యాజమాన్యాలపై కేసు పెడతామని మంత్రి గంటా చెప్పారని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఒకవేళ నారాయణ కళాశాలల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఏమైనా ఇచ్చిందా? అని అడిగారు.