: విద్యార్థి సూసైడ్ పై కడియం క్విక్ రియాక్షన్...విచారణ కోసం కరీంనగర్ కలెక్టర్ కు ఆదేశం
కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పరిధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సంతోష్ రెడ్డి ఘటనపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వేగంగా స్పందించారు. ఫీజు కట్టలేదన్న కారణంతో పాఠశాల యాజమాన్యం సంతోష్ రెడ్డిని తరగతి గది బయట నిలబెట్టింది. దీనిపై సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన సంతోష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే విద్యా శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కడియం కరీంనగర్ కలెక్టర్ కు ఫోన్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలను కట్టడి చేయాల్సిందేనని ఈ సందర్భంగా కడియం అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వాటిని ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాక ఆత్మహత్యలు చేసుకోరాదని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలల ఆగడాలపై అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.