: ఖైరతాబాదు వినాయకుడి ప్రసాదం కోసం బారులు తీరిన భక్తజనం
భారీ గణనాధుడిగా వినుతికెక్కిన హైదరాబాదు, ఖైరతాబాదు వినాయకుడి ప్రసాదం కోసం హైదరాబాదులో భక్తజనం బారులు తీరారు. వినాయక చవితి సందర్భంగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖైరతాబాదులో 59 అడుగుల భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ వినాయకుడి చేతిలో పెట్టేందుకు తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు 5,600 కేజీల లడ్డూను తయారు చేశారు. మొన్నటి వినాయక నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాదు వినాయకుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూను భద్రపరచిన ఉత్సవ కమిటీ సభ్యులు నేడు భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం 10.30 గంటలకు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో గణేశుడి ప్రసాదం కోసం నేటి ఉదయం నుంచే ఖైరతాబాదులో భక్తులు బారులు తీరారు.