: 'బ్రూస్ లీ' సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మ!
'బ్రూస్ లీ' సినిమా ట్రైలర్ రాంగోపాల్ వర్మ విడుదల చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది రాంచరణ్ 'బ్రూస్ లీ' కాదు. రాంగోపాల్ వర్మ తదుపరి సినిమా 'బ్రూస్ లీ'. ఈ సినిమా ట్రైలర్ ను రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ట్రైలర్ ప్రకారం దీనిని లేడీ ఓరియెంటెడ్ సినిమాగా భావించవచ్చు. ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటులను వర్మ వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. 'బ్రూస్ లీ' మరణించి ఉండవచ్చు, కానీ ఆయన ప్రభావం ఇంకా మరణించలేదు... అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అలాగే 'ఇది మొట్టమొదటి ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ సినిమా' అనడంతో ట్రైలర్ ముగుస్తుంది. ట్రైలర్ లో ఓ యువతి ప్రత్యర్థులతో కలబడడం కనపడుతుంది. కాగా, ఈ సినిమా ఎన్ని భాషల్లో రూపొందుతోందన్న విషయంపై వర్మ స్పష్టతనివ్వాల్సి ఉంది. ఇదిలా ఉంచితే, 'బ్రూస్ లీ' పేరుతో రాంచరణ్ నటిస్తున్న సినిమా ఆడియో వేడుక రేపు హైదరాబాదులో జరగనుంది.