: 'మహా' ప్రజలపై కొత్తగా కరవు పన్ను
రాష్ట్రంలో కరవు పరిస్థితులను అధిగమించాలంటే ప్రజలపై భారం వేయక తప్పదని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దెబ్బతిన్న రైతుల సంక్షేమం కోసం రూ. 1600 కోట్లు సమీకరించాలని భావించిన ఫడ్నవీస్ ప్రభుత్వం తక్షణం అమల్లోకి వచ్చేలా కరవు పన్ను విధించింది. 'పెట్రో' ఉత్పత్తులు, సిగరెట్లు, మద్యం, బంగారం, రెస్టారెంట్లు వంటి అన్ని లావాదేవీలపైనా ఈ పన్నును వచ్చే ఐదు నెలల పాటు విధించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగంతివర్ తెలిపారు. ఫిబ్రవరి చివరి వరకూ ఈ పన్ను అమలవుతుందని, ఆపై పరిస్థితిని బట్టి సమీక్షిస్తామని వివరించారు. కాగా, కొత్త పన్నుల తరువాత పెట్రోలు, డీజిల్ ధర రూ. 2 రూపాయలు పెరగనుంది. మద్యం, సిగరెట్లు, కూల్ డ్రింకుల ధరలు 5 శాతం, బంగారం, వజ్రాలు, ఆభరణాలపై 0.2 శాతం వ్యాట్ పడనుంది. నిత్యావసర వస్తువులపై తాము పన్నులు విధించలేదని, లగ్జరీ విభాగంలో ఉన్న వాటిపైనే కొత్త పన్నులు అమలవుతాయని సుధీర్ వివరించారు.