: కేజ్రీ సర్కారుకు మరో ఎదురుదెబ్బ... మనీష్ సిసోడియాపై ఏసీబీ దర్యాప్తు షురూ!
తొలుత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు, తర్వాత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం... రెండింటితో ఎన్నికల బరిలోకి దిగి దేశ రాజధాని ప్రజల ఆదరాభిమానాలతో ఏడాది వ్యవధిలో రెండు పర్యాయాలు ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తొలిసారి సీఎం అయిన సందర్భంలో కేంద్రంలోని యూపీఏ సర్కారుతో ప్రత్యక్ష పోరుకు దిగిన కేజ్రీవాల్ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు. తాజాగా రెండో సారి సీఎం పీఠం ఎక్కిన ఆయనకు సొంత పార్టీ నేతల వ్యవహార సరళి తలనొప్పిగా మారింది. మొన్నటికి మొన్న గృహ హింస కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి అరెస్ట్ కాగా, తాజాగా ఆప్ సర్కారులో కేజ్రీవాల్ తర్వాతి స్థానం డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న మనీష్ సిసోడియాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాంట్రాక్టులను తన సమీప బంధువులకు కట్టబెట్టారన్న ఆరోపణలకు సంబంధించి సిసోడియాపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా చెప్పారు. సిసోడియాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ పౌర సంబంధాల శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని ఆయన తెలిపారు.