: తెలుగు రాష్ట్రాల రైళ్ల వేళల్లో జరిగిన భారీ మార్పులు ఇవే!
నేటి నుంచి పలు రైళ్ల వేళలు మార్చామని, అలాగే ఆగాల్సిన స్టేషన్ల సంఖ్యను, నడిచే రోజులనూ మార్చామని రైల్వే శాఖ వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 'దురంతో' రైళ్లకు కొత్త స్టాపులను ఇచ్చామని, అలాగే 4 ఎక్స్ ప్రెస్, 2 ప్యాసింజర్ రైళ్లను పొడిగించామని, 3 రైళ్ల మార్గాన్ని మళ్లించామని, 30 రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించామని, 12 రైళ్ల నెంబర్లను మార్చగా, 59 రైళ్ల వేళల్లో మార్పులు చేశామని వివరించారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో జరిగిన ఆ మార్పుల వివరాలివి... సికింద్రాబాద్ - విశాఖపట్నం 'దురంతో' ఎక్స్ ప్రెస్ ఇకపై విజయవాడలో ఆగుతుంది. సికింద్రాబాద్ - ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పుణేలో ఆగుతుంది. యశ్వంత్ పూర్ - ఢిల్లీ సరాయి రోహిల్లా దురంతో ఎక్స్ ప్రెస్ గుంతకల్, సికింద్రాబాద్ లో, హౌరా - యశ్వంత్ పూర్ దురంతో ఎక్స్ ప్రెస్ విజయవాడ, రేణిగుంటలో, చెన్నై - హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ విజయవాడలో ఆగుతాయి. తిరుపతి - హజ్రత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ఇక నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు రాదు. కాచిగూడ మీదుగా మాత్రమే ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య తిరిగే పద్మావతి ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం సోమ, గురు, శుక్ర, శని, ఆది వారాల్లో తిరుగుతుండగా, కొత్తగా మంగళవారాన్ని కలిపి శనివారాన్ని తొలగించారు. ఇదే సమయంలో తిరుపతి నుంచి వచ్చే రైలులో ఆదివారాన్ని తొలగించి బుధవారాన్ని కలిపారు. సికింద్రాబాద్ నుంచి పాకాల మీదుగా తిరుపతి వెళ్లే రైలు ప్రస్తుతం మంగళ, బుధవారాల్లో తిరుగుతుండగా, ఇకపై బుధ, శనివారాల్లో ప్రయాణించనుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో బుధ, గురువారాలను, గురు, ఆదివారాలుగా మార్చారు. వీటితో పాటు సికింద్రాబాద్ - కర్నూలు సిటీ, తెనాలి - రేపల్లె పాసింజర్, తెనాలి - మార్కాపూర్ రోడ్ం గుంటూరు - తెనాలి, నర్సాపూర్ - గుంటూరు - తెనాలి, గుంటూరు - మాచర్ల - భీమవరం, భీమవరం - రాజమండ్రి - నర్సాపూర్, మాచర్ల - నడికుడి, కాచిగూడ - గుంటూరు మధ్య ప్రయాణించే రైళ్ల నంబర్లను మార్చారు. కొత్త టైం టేబుల్, రైళ్ల వివరాలతో కూడిన పుస్తకాలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మార్పులు తక్షణం అమల్లోకి వచ్చినట్టని వెల్లడించింది.