: జగదీశా... నీ పని నీవు చూసుకో!: విద్యుత్ శాఖ మంత్రికి కేసీఆర్ మందలింపు
తెలంగాణ అసెంబ్లీలో నిన్న ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా సభలో అధికార పక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి విపక్ష సభ్యులపై విరుచుకుపడడం మనకు తెలిసిందే. అయితే నిన్నటి సమావేశాల్లో భాగంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన సొంత కేబినెట్ సహచరుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందటే... నిన్నటి సభలో వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై మాట్లాడేందుకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ యత్నించారు. అదే సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తన ప్రకటనను చదవడం ప్రారంభించారు. దీంతో కల్పించుకున్న స్పీకర్ మంత్రిని కూర్చోమని సూచించారు. అయితే స్పీకర్ సూచనను గమనించని పోచారం తన ప్రకటనను కొనసాగించారు. ఈ సమయంలో పోచారం పక్క సీట్లో కూర్చున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పోచారంను ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన ‘‘ఓ అన్నా... కూకో అన్నా’’ అంటూ కాస్త గట్టిగానే అరిచారు. దీంతో కేసీఆర్ చికాకుపడ్డారు. ‘‘నీకేం పని... నీ పని నీవు చూసుకో’’ అంటూ జగదీశ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.