: మా పాప బతికే ఉండి ఉంటుంది: 'అదితి' తండ్రి శ్రీనివాస్
తన కుమార్తె అదితి ఇంకా బతికే వుండి ఉంటుందని, బాలిక తండ్రి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్యూషన్ నుంచి వస్తున్న చిన్నారి అదితి వారం రోజుల క్రితం మురుగు నీటిలో కొట్టుకుపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే, ఆమె కోసం ఎంతగా వెదికినా ఇంతవరకు ఆమె జాడ తెలియరాలేదు. దీనిపై ఆమె తండ్రి శ్రీనివాస్ ఈరోజు విశాఖపట్టణంలో మాట్లాడుతూ, తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే, పాపను కిడ్నాప్ చేసినట్టు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని అన్నాడు. వర్షంలో కొట్టుకుపోయిందని అప్పుడు కొంత మంది చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా పాపను వెతికామని అన్నారు. అయితే ఇన్నాళ్ల వెతుకులాటలో పాపకు సంబంధించిన ఎలాంటి ఆధారమూ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి, ఎక్కడికైనా తరలించారా? అనే అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. తన కుమార్తెను తనకు అప్పగిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తన కుమార్తె తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. అయితే తమకు ఎవరిపైనా ఆనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. పాప ఆచూకీ తెలిస్తే ఎవరైనా చెప్పాలని ఆయన కోరారు.