: ఐఎస్ ను తక్కువగా అంచనా వేస్తున్నారు... 50 కోట్ల మందిని చంపడానికి వాళ్లు ప్లాన్ చేస్తున్నారు: జర్మన్ జర్నలిస్ట్
ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా అరాచకాలను సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పాశ్చాత్య దేశాలు తక్కువగా అంచనా వేస్తున్నాయని జర్మనీకి చెందిన 75 ఏళ్ల జర్నలిస్ట్, మాజీ ఎంపీ జూర్జెన్ టోడెన్ హోఫర్ అన్నారు. 50 కోట్ల మందిని చంపేందుకు ఐఎస్ టెర్రరిస్టులు వ్యూహాలను రచిస్తున్నారనే భయానక నిజాన్ని ఆయన వెల్లడించారు. హిందువులు, నాస్తికులు, యాజిదీలు, షియా ముస్లింలు, విగ్రహారాధకులను అంతమొందించాలనే ప్లాన్ లో ఉన్నారని తెలిపారు. ఇందుకోసం బాంబులు, ఫిరంగులు సరిపోవని భావించి... అణ్వాయుధాలను సైతం ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదుల వ్యూహాలు భయానకంగా ఉన్నాయని... అణు సునామీ ద్వారా ప్రపంచాన్ని శవాల దిబ్బగా మార్చడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని హెచ్చరించారు. ఓ జర్మన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోడెన్ హోఫర్ ఈ మేరకు తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదుల మూలాలను, మనోభావాలను తెలుసుకొని ఓ పుస్తకం రాయడం కోసం ఆయన వారితో సంబంధాలను నెలకొల్పుకున్నారు. స్వతహాగా అమెరికా విధాలను ఎండగడుతూ మంచి క్రిటిక్ గా పేరుతెచ్చుకోవడంతో ఆయనకు ఐఎస్ నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఇరాక్ లోని మోసుల్ నగరం, పరిసర ప్రాంతాల్లో ఐఎస్ ఉగ్రవాదులతో కలసి ఆయన పది రోజులు గడిపారు. అక్కడ గడిపిన పది రోజుల అనుభవంతో 'ఇన్ సైడ్ ఐఎస్-టెన్ డేస్ ఇన్ ది ఇస్లామిక్ స్టేట్' అనే పుస్తకాన్ని రచించారు. ఐఎస్ ఉగ్రవాదుల మానసిక స్థితిలో మార్పు వచ్చే అవకాశాలు తనకు ఏ మాత్రం కనిపించలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మానవ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విపత్తును చూడాల్సి వస్తుందేమోననే భయం తనకు కలుగుతోందని చెప్పారు.