: నాలుగు రోజులు కనబడకుంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా: విరుచుకుపడ్డ సినీ నటుడు శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నేతలు పచ్చి బూతులు, అబద్ధాలు మాట్లాడుతున్నారని, అందువల్లనే తాను మనిషిగా మాట్లాడాల్సి వస్తోందని సినీనటుడు శివాజీ అన్నారు. నాలుగు రోజులు తాను కనబడకుంటే ఇష్టానికి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఈ సాయంత్రం ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీకి ఇంకా రూ. 14 వేల కోట్లు రావాల్సి వుందని, దాన్నే ఇంకా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. దాన్ని ఏపీ ప్రభుత్వం తెచ్చుకోలేకపోయిందని అన్నారు. కేంద్రం రూ. 8 వేల కోట్లు ఇచ్చిందని మంత్రి సుజనా చౌదరి చెప్పడం, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడమేనని అన్నారు. పిల్లలకు పంచే పప్పూ బెల్లాల్లాగ, ఆగస్టు 15కు చాక్లెట్లు ఇచ్చినట్టు ఉత్తరాంధ్రకు, రాయలసీమ జిల్లాలకు రూ. 50 కోట్ల చొప్పున ప్యాకేజీలు ఇచ్చి సరిపుచ్చాలని భావిస్తున్నారని విమర్శించారు. అవి కూడా ఇప్పటికిప్పుడు రావని అన్నారు. నేతలంతా డ్రామాలాడుతున్నారని, ఎంతకాలం ఇలా మోసం చేస్తారని ప్రశ్నించారు. నేతలు నిజాయతీ తప్పి సొంత లెక్కలు, పాత లెక్కలు చూబితే సహించబోమని అన్నారు. ప్రకృతి సహకరించి, వర్షాలు కురవబట్టే ప్రజలు కొంత సంయమనంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రతి మంత్రి సంపాదనపైనా తన వద్ద లెక్కలున్నాయని, సమయం వస్తే వాటిని బయటపెడతానని తెలిపారు.